గిరిజన పల్లెలకూ మిషన్‌ భగీరథ జలాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజన పల్లెలకూ మిషన్‌ భగీరథ జలాలు

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

మోపాల్‌ : మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం మిషన్‌ భగిరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. మండలంలోని అమ్రాబాద్‌ తండాను కలెక్టర్‌ గురువారం సందర్శించారు. మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణంలో పలు తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో అమ్రాబాద్‌ తండా సహా సుమారు 11 నివాస ప్రాంతాలకు మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాలకు మిషన్‌ భగీరథ జలాలు అందించేందుకు వీలుగా అనువైన పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్‌ క్షేత్రస్థాయి సందర్శన చేపట్టారు. తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నామని స్థానిక గిరిజనులు కలెక్టర్‌కు తెలిపారు. దీంతో మిషన్‌ భగీరథ నీటి సరఫరా కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుకూలమైన ప్రదేశంలో ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చి జల్‌ జీవన్‌ మిషన్‌ కింద కవర్‌ అయ్యేలా చూడాలన్నారు. కాగా ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన రీతిలో వర్షాలు కురవక నీటి నిల్వలు అంతంతమాత్రంగానే అందుబాటులో ఉన్నాయని, భూగర్భ జలమట్టంసైతం దిగువకు పడిపోయినందున ఖరీఫ్‌లో ఆరుతడి పంటలే సాగు చేయాలని స్థానిక రైతులకు కలెక్టర్‌ సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పప్పుదినుసులు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్‌, మిషన్‌ భగీరథ ఈఈ రాకేశ్‌, తహసీల్దార్‌ రేఖ, సర్పంచ్‌ ప్రియాంక ప్రేమ్‌, నాయకులు రవి, మండల అధికారులు, తదితరులు ఉన్నారు.

మంచి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి

అధికారులకు కలెక్టర్‌

ఇలా త్రిపాఠి ఆదేశం

అమ్రాబాద్‌ తండాను సందర్శించిన పాలనాధికారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement