కమ్మర్‌పల్లి(భీమ్‌గల్) : పోలీసుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశానని పొలాస సుధాకర్ స్వయంగా చెప్పినా, ఈ ఘటనలో పోలీసు ప్రమేయం లేదని సీపీ పేర్కొనడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుధాకర్ మృతి వార్త తెలుసుకుని తాను భీమ్‌గల్‌కు బయల్దేరితే పోలీసులు హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారని, ఇది పిరికిపంద చర్య అని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు ఎస్సై తిరుపతిపై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబంలో నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.


