● అసంపూర్తి ఫోర్‌లేన్ పనులతో
నిత్యం ప్రమాదాలు
● ఎన్‌హెచ్ 785–డి పనులపై
కొరవడిన పర్యవేక్షణ
బాన్సువాడ: జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు, రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోడ్డు దాటాలన్నా.. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసంపూర్తిగా మిగిలిన ఫోర్‌లేన్ నిర్మాణ పనులు, సర్వీసు రోడ్ల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి ఈ మార్గాన్ని ప్రమాదాలకు నిలయంగా మార్చాయి. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
బాన్సువాడ మండలం కొత్తాబాది గ్రామంలోని సంతోష్‌నగర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న దారావత్ గోపాల్ (40) లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ఈ రహదారిపై తరచూ చోటుచేసుకుంటున్నాయి. మెదక్ – ఎల్లారెడ్డి – బాన్సువాడ – రుద్రూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులతో పాటు పాదచారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రతినెలా పది మందికిపైగా ప్రమాదాల బారిన పడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
సర్వీసు రోడ్లు లేక ఇబ్బందులు
బాన్సువాడ సమీపంలోని కొయ్యగుట్టకు వెళ్లే మార్గంతో పాటు పలు ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సర్వీసు రోడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గ్రామాల ప్రజలు ప్రధాన రహదారిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. బాన్సువాడ – బోధన్ మార్గంలో పలుచోట్ల సర్వీసు రోడ్ల నిర్మాణం కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లే గ్రామస్తులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటే సమయంలో వేగంగా వచ్చే వాహనాల బారిన పడుతున్నారు.
పర్యవేక్షణ ఏదీ?
జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన సూచిక బోర్డులు, హెచ్చరిక సంకేతాలు, తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే పనులు నత్తనడకన సాగుతుండటంతో పాటు పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తి పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మూడేళ్లయినా
పూర్తికాని పనులు
ఎన్‌హెచ్ 785–డి నిర్మాణానికి రూ.499 కోట్లు మంజూరుకాగా, రూ.313 కోట్లకు టెండర్ ప్రక్రియ చేపట్టారు. అలైన్‌మెంట్ ఖరారై పను లు ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. బాన్సువాడ పట్టణంతో పాటు నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహ్మద్‌నగర్, కొత్తాబాది, దుర్కి, నెమ్లి, నస్రుల్లాబాద్, వర్ని, అక్బర్‌నగర్, రుద్రూర్ తదితర ప్రాంతాల ప్రజలకు ఈ రహదారి ఎంతో కీలకం. హైదరాబాద్, నిజామాబాద్, బోధన్ వైపు రాకపోకలు సాగించేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి.
పట్టించుకోవాలి
రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. అసంపూర్తిగా ఉన్న చోట్ల రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇకనైనా అధికారులు రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. – రఘు, కొత్తాబాది
భయంగా ఉంది
బాన్సువాడ – బోధన్ ప్రధాన రహదారిలో రోడ్డు దాటాలంటే భయంగా ఉంది. వాహనాల రద్దీ చాలా ఉంటుంది. రోడ్డుకు అవతల పక్కన ఉన్న ఇంటికి వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు సర్వీసు రోడ్డును త్వరగా పూర్తిగా చేయాలి. – సాయిలు, దుర్కి


