● జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఘటన
కామారెడ్డిక్రైం: జిల్లాకేంద్రంలోని కొటారి గల్లీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కొటారి గల్లీలో నివాసం ఉండే చిట్టిమెల్ల సుదర్శన్‌కు భార్య అనసూయ (72), నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు కావడంతో వారంతా వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. సొంత ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే సుదర్శన్ మంగళవారం సాయంత్రం సమీపంలోని ఆలయానికి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి అతడు ఇంటికి రాగా, హాల్‌లోని మంచంపై భార్య విగతజీవిగా పడి ఉంది. ఆమె ముక్కు, గొంతు వద్ద రక్తపు మరకలు ఉండటంతో సుదర్శన్ వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి మెడలోని పుస్తెల తాడు, చెవి కమ్మలు కనిపించకపోవడంతో వాటి కోసమే ఆమెను దుండగులు హత్య చేసి ఉండవచ్చని కుటుంబీకులు భావిస్తున్నారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.


