చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
డొంకేశ్వర్: ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన డొంకేశ్వర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. డొంకేశ్వర్‌కు చెందిన మాడబోయి కట్ట గణేశ్(37) ఈ నెల 28న సాయంత్రం చేపల వేటకు గంగాసముందర్ ప్రాంతానికి వెళ్లాడు. గోదావరి బ్యాక్ వాటర్‌లో చేపల వలను వేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. వల కాళ్లకు చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. గణేశ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తోటి మత్స్యకారులు మంగళవారం ఉదయం బ్యాక్ వాటర్‌కు వెళ్లి చూడగా నీటిపై తేలుతూ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య, బాబు, పాప ఉన్నారు. భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకొడప్‌గల్ మండలం కాస్లాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికొండ(50) కుటుంబం పదేళ్ల క్రితం మేడ్చల్ జిల్లాకు వలస వెళ్లారు. ప్రతి నెలా సాయిగొండ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. కొన్ని రోజుల నుంచి కాస్లాబాద్‌లోనే ఉంటున్నాడు. గతేడాది నుంచి అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: రైల్వేస్టేషన్‌లో పార్సిల్ కార్యాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. 45 ఏళ్ల మగవ్యక్తి అనారోగ్య కారణాల వల్ల మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712658591 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలో కోటగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి రూ.31వేల నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


