కమిషనర్‌తో వాగ్వాదానికి దిగిన
వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
బోధన్ బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు
బోధన్‌టౌన్: బోధన్ బల్దియా ఎదుట ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. బల్దియాలో మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని, సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా అంశాలపై ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు ఆమోదం చేసుకున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్‌తో పాటు ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రజల పక్షాన నిలబడి పట్టణాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన మున్సిపల్ కమిషనర్ ప్రతిపక్షాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట కమిషనర్‌ను ముట్టడించారు. పట్టణ సీఐ వెంకటనారాయణ వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైస్ చైర్మన్, బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడారు. మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారని, వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో చర్చిద్దామని వస్తే కేవలం 5 నిమిషాల్లోనే 19 ఎజెండా అంశాలు, వినాయక నిమజ్జనానికి ఏర్పాట్ల ఖర్చు రూ. 16లక్షల50వేల బిల్లులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల అంశాలు కౌన్సిలర్లతో చర్చించకుండానే అధికార పార్టీ ఆమోదం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చైర్‌పర్సన్ పట్టణాభివృద్ధిపై దృష్టిసారించడం లేదని అన్నారు. విషయాన్ని ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం ఎజెండా అంశాల ప్రతులను చించి వేశారు. బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.


