నిజామాబాద్ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నూతన కమిటీ ఏర్పాటుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం జిల్లా ఎన్నికల అధికారి ఎన్ శ్రీనివాసరావు తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. నగరంలోని ఆదర్శ హిందీ మహావిద్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించి, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు.
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) డిచ్‌పల్లి ఆధ్వర్యంలో ఈ నెల 28, 30వ తేదీల్లో ప్రారంభించనున్న ఉచిత శిక్షణకు గ్రామీణ ప్రాంత యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న సెల్‌ఫోన్ రిపేరింగ్ (30 రోజులు), 30న సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ (13 రోజులు) శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తారని పేర్కొన్నారు. 19 నుంచి 49 సంవత్సరాల వయసు గల జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిరా జ్ కళాశాల మైదానంలో అస్మిత ఖేలో ఇండియా రగ్బీ టోర్నీ శనివారం ప్రారంభమైంది. ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్స య్య ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో క్రీడల పరిస్థితి దయనీయంగా తయారైందని, కోచ్‌ల కొరతతో క్రీడలు కూనరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. క్రీడల ప్రగతికి క్రీడా సంఘాలు తోడ్పాటును అందిస్తున్నాయని చెప్పారు. సౌకర్యాల లేమి మధ్య క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సత్తా చాటుతున్నారన్నారు. రగ్బీ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు రెంజర్ల నరేశ్, ప్రధాన కార్యదర్శి పల్లిపాడు అబ్బయ్య, జీజీ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, వ్యాయామ అధ్యాపకురాలు డాక్టర్ బాలమణి పాల్గొన్నారు.


