● కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో
ముగ్గురు ట్రాన్స్‌కో ఉద్యోగుల మృతి
● మూడు కుటుంబాల్లో విషాదం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. హోదాలు వేరైనా వారి మధ్య గాఢమైన స్నేహం నెలకొంది. అయితే, ఒకేరోజు అందరికీ సెలవు కలిసి రావడంతో లక్నవరం విహారయా త్రకు వెళ్లాలని భావించారు. గురువారం సాయంత్రం విధులు ముగిసిన వెంటనే కారులో ఉత్సాహంగా బయలుదేరిన వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. మార్గమధ్యలో చోటుచేసుకున్న రో డ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విహారయాత్ర కాస్త విషాదంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలం యానంపల్లి శివారు 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన పంగెర సుధాకర్ (32) వాచ్‌మెన్ (ఆర్టిజెన్), నిజామాబాద్‌కు చెందిన ప్రభు (38) లైన్‌మన్, వరంగల్‌కు చెందిన విశ్వేశ్వరరావు (44) అసిస్టెంట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు నందిపేట మండలం వెల్మల్‌కు చెందిన మురళి, మంచిప్ప తండాకు చెందిన రమావత్ ప్రవీణ్ జేఎల్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రభు కారులో గురువారం సాయంత్రం వరంగల్‌లోని విశ్వేశ్వరరావు ఇంటికి బయలుదేరారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకొని శుక్రవారం ఉదయాన్నే లక్నవరం చెరువును సందర్శించి తిరిగి రాత్రికి నిజామాబాద్ రావాలని నిర్ణయించుకున్నారు. అయితే, మార్గమధ్యలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో జాతీయ రహదారి 563 పై ఆగిఉన్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్, ప్రభు, విశ్వేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రవీణ్, మురళి గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో 400 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
శోకసంద్రంలో నడిపల్లి..
సుధాకర్ మృతితో నడిపల్లి గ్రామంలో తీవ్ర విషా దం నెలకొంది. సుధాకర్ తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. ఐదు సంవత్సరాల క్రితం విశ్వజతో పెళ్లి అయింది. పిల్లలు లేరు. 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో తొమ్మిది సంవత్సరాలుగా సుధాకర్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం మృతదేహం గ్రామానికి చేరుకుంది. అందరితో కలిసి మెలిసి ఉండే సుధాకర్ మృతదేహాన్ని చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. కన్నీళ్లతో భార్య విశ్వజ భర్త సుధాకర్‌కు అంత్యక్రియలు నిర్వహించింది.


