● ఎమ్మార్సీలకు చేరుతున్న ప్యాకెట్లు
● పంపిణీ బాధ్యత ఎంఈవోలకు..
● వేలాది మంది ‘సర్కారు’
విద్యార్థినులకు ప్రయోజనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే) కింద మెన్‌స్ట్రువల్ హైజీన్ స్కీంను అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా బాలికలకు సానిటరీ నాప్కిన్‌లను పంపిణీ చేస్తారు.
రాష్ట్రంలోని 5,702 ఉన్నత పాఠశాలల్లో 3,95,751 మంది కిశోర బాలికలున్నారు. వీరికోసం 13,88,739 నాప్కిన్ ప్యాక్‌లను సరఫరా చేయనున్నారు. ఒక్కో ప్యాక్‌లో ఎనిమిది సానిటరీ నాప్‌కిన్‌లుంటాయి. వీటిని రాష్ట్రంలోని 630 మండల రిసోర్స్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు చేరాయి. ఎమ్మార్సీలనుంచి పాఠశాలలకు పంపిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని 33 ఎమ్మార్సీలకు 77,883 నాప్కిన్ ప్యాక్‌లు, కామారెడ్డి జిల్లాలో 25 ఎమ్మార్సీలకు 59,949 ప్యాక్‌లు రానున్నాయి. కాగా నాప్కిన్ ప్యాకెట్లను పంపిణీ, పర్యవేక్షణ బాధ్యతలను ఆయా మండలాల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. జిల్లా స్థాయిలో డీఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. సర్కారు నిర్ణయంపై టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చకినాల అనిల్‌కుమార్, నన్నెబోయిన తిరుపతిలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు సానిటరీ న్యాప్‌కిన్స్ అందించాలని తాము గతంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌కు విన్నవించామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సానిటరీ ప్యాడ్స్ అందించేందుకు చర్యలు తీసుకున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


