● అంతర పంటగా గంజాయి మొక్కలు
● ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా
● రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా
కామారెడ్డి క్రైం: మాదకద్రవ్యాల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు. గంజాయికి అలవాటవుతున్న యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటుండగా.. కొందరు గుట్టుచప్పుడు కాకుండా సాగు, సరఫరాకు పాల్పడుతున్నారు. తాజాగా గాంధారి శివారులో 550 గంజాయి మొక్కలు పట్టుబడటం పరిస్థితికి అద్దం పడుతోంది.
అంతర పంటగా..
15 ఏళ్ల క్రితం గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలు, పంట పొలాల్లో గంజాయి సాగు జరిగేది. పోలీసుల దాడులతో సాగు తగ్గినా.. ప్రస్తుతం కొందరు కంది, పత్తి, మొక్కజొన్న వంటి పంటల మధ్య అంతర పంటగా గుట్టుగా సాగు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పెద్దకొడప్‌గల్ మండలం కాటేపల్లి తండాలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. గాంధారి మండలం మేడిపల్లి, గండివేట్ శివారుల్లో మొక్కజొ న్న పంటలో వందలాది మొక్కలను గుర్తించి కేసులు నమోదు చేశారు. నేరల్, చద్మల్, బీర్మల్ తండాల పరిధిలో గడిచిన రెండేళ్ల కాలంలో అనేక గంజాయి కేసులు నమోదయ్యాయి. తాజాగా గాంధారి శివారులో 550 మొక్కలు పట్టుబడి ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.
జోరుగా అక్రమ దందా
గంజాయి సరఫరా గ్రామాలకూ విస్తరిస్తోంది. రూ. లక్షల్లో లాభాలు వస్తాయనే ఆశతో కొందరు ఈ అక్రమ దందాలోకి దిగుతున్నారు. రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా జరుగుతోంది. ఈ ఏడాది నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటి వరకు ఏడు సార్లు గంజాయి పట్టుబడింది. ఇటీవల గాంధారిలో బైక్‌పై గంజాయి తరలిస్తున్న ఇద్దరి నుంచి అర కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం క్యాసంపల్లి వద్ద జాతీయ రహదారి–44పై పనసపండ్ల మాటున డీసీఎంలో తరలిస్తున్న రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. గతేడాది జిల్లాలో 23 కేసులు నమోదై 73 మంది జైలుకు వెళ్లారు. ఈ ఏడాది కూడా గంజాయి కేసులు కొనసాగుతుండటంతో కట్టడికి మరింత పకడ్బందీ నిఘా అవసరమని పలువురు కోరుతున్నారు.
యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్ మాఫియాకు కామారెడ్డి జిల్లాలో ఎలాంటి అవకాశం ఇవ్వం. అలాంటి చర్యలను సహించేది లేదు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ, పోలీస్ అధికారులకు గానీ, డయల్ 112 కు గానీ సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి


