● భార్య పై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు
● పోస్టుమార్టం కోసం మృతదేహం తరలింపు
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామానికి చెందిన తొత్తల లింగయ్య (46) గురువారం రాత్రి మృతి చెందాడు. అంత్యక్రియల్లో భాగంగా శుక్రవారం ఉదయం మృతదేహానికి స్నానం చేయిస్తుండగా ఒంటిపై పలు గాయాలు కనిపించడంతో బంధువులు డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాల వల్లే మరణించి ఉంటాడని, అతడి భార్య పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు అంత్యక్రియలను నిలిపివేయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు నిత్యం మద్యం సేవించేవాడని, తరచూ పడి దెబ్బలు తగిలించుకునేవాడని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అసలు ఎలా చనిపోయాడనే విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు..
నిజామాబాద్ రూరల్: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఒకరు నీట మునిగి మృతి చెందిన ఘటన మల్లారంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన లస్కరి లచ్చయ్య(50) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చెరువు వద్ద అతని దుస్తులు కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతదేహం బయటకు తేలింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి టౌన్: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమం నుంచి శుక్రవారం ఉదయం ఓ వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. ఉదయం 8 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వృద్ధురాలి వయస్సు 55 ఏళ్ల వరకు ఉంటుంది. ఆమె మానసిక పరిస్థితి సక్రమంగా లేదు. ఇటీవల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిలో ఉండగా ప్రభుత్వ వృద్ధాశ్రమంలో చేర్పించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తల్లీ కొడుకు ..
మాచారెడ్డి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత, నాలుగేళ్ల కుమారుడు అదృశ్యమైనట్లు ఎస్సై విజయ్ తెలిపారు. గ్రామానికి చెందిన వివాహిత ఈ నెల 12న మధ్యాహ్నం ఇంటి నుంచి కుమారుడితో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


