జక్రాన్‌పల్లి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని పల్లవి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 20 వరకు కమ్మర్‌పల్లిలో నిర్వహించే 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగామోహన్ గురువారం తెలిపారు. పల్లవిని హెచ్‌ఎం, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచ్ పద్మనాగరాజ్, వీడీసీ అధ్యక్షుడు ఎర్రోళ్ల గంగాధర్, ఉపాధ్యాయులు అభినందించారు.
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన కట్ట నర్సారెడ్డి సైబర్ మోసానికి గురయ్యాడు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన వర్ని పోలీసులు పోయిన రూ. 92 వేల నగదు శుక్రవారం తిరిగి అందేలా చేశారు. వర్ని ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సా రెడ్డి ఈ నెల 3వ తేదీన నిజామాబాద్ వెళ్లడానికి మోస్రాలో బస్ ఎక్కుతుండగా ఫోన్ దొంగలించబడింది. ఈ నెల 5వ తేదీన ఫోన్ పే ద్వారా రూ. 92 వేలు డెబిట్ అయినట్లు గుర్తించి వర్ని పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు సాంకేతిక చర్యలు చేపట్టి పోగొట్టుకున్న రూ. 92 వేల నగదును రికవరీ చేసి బాధితుడికి అందేలా చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.
● మరో రెండు బోర్ స్టార్టర్లు, సర్వీస్ వైర్లు చోరీ
● రూ. ఆరు లక్షల వరకు నష్టం
మోపాల్: మండలంలోని సిర్‌పూర్ శివారులో ఒక బోరును పూర్తిగా ధ్వంసం చేయడంతోపాటు మరో రెండు బోర్లకు సంబంధించిన స్టార్టర్లు, సర్వీస్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు గణేశ్ వ్యవసాయ క్షేత్రంలో మూడు బోర్లు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక బోరును ధ్వంసం చేసి అందులో రాళ్లు వేసి పూర్తిగా వినియోగించకుండా చేశారు. అంతేగాకుండా మరో రెండు బోర్ల స్టార్టర్లు, వైర్లను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి పంచనామ చేశారు. సుమారు రూ. ఆరు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా సిర్‌పూర్ గ్రామంలో గతంలో కూడా రెండు బోర్లను ఇదే మాదిరిగా దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. తరచూ బోర్లను ధ్వంసం చేస్తుండటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.


