డొంకేశ్వర్/ నందిపేట్: డొంకేశ్వర్, నందిపేట్ మండలాల పరిధిలోని హోటళ్లు, దాబాలు, కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎఫ్‌వో, ఎఫ్‌డీవోల ఆదేశాల మేరకు ఆర్మూర్ రేంజ్ ఆఫీసర్ అరుణ్‌కుమార్ సమక్షంలో ఈ సోదాలు చేపట్టారు. మండల పరిధిలోని దాబాల్లో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తున్నారా? కార్పెంటర్ దుకాణాల్లో అక్రమ కలప నిల్వలు ఉన్నాయా? అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. దాబాల నిర్వాహకులు అడవి జంతువుల మాంసాన్ని వండడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎఫ్‌ఆర్‌వో స్పష్టం చేశారు. దాడుల్లో డిప్యుటీ రేంజ్ ఆఫీసర్లు శ్రీదేవి, రణవీర్, సుధాకర్, బీట్ ఆఫీసర్ లింబాద్రి ఉన్నారు.


