సుభాష్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే ఆపాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్, రైస్‌మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మోటూరి దయానంద్ గుప్తా, వడ్డి మోహన్ రెడ్డి, కాపర్తి శ్రావణ్, ధన్‌పాల్ దత్తాద్రి డిమాండ్ చేశారు. రైస్‌మిల్లర్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైస్‌మిల్లుల్లో మిల్లింగ్, ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం, రైస్‌మిల్లర్ల సమస్యలు, ఇతర పరిస్థితులపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని ధాన్యానికి నాణ్యమైన బియ్యం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జిల్లాలోని రైస్‌మిల్లుల్లో గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని, ఆ బియ్యం పూర్తిగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ వంద శాతం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతే వచ్చే సీజన్‌లో ధాన్యం కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు బకాయిలు ఉన్న మిల్లర్లకు 25 శాతం ఫెనాల్టీ, 12 శాతం ఇంట్రెస్ట్‌ను వెంటనే మాఫీ చేయాలన్నారు. 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన మిల్లింగ్ చార్జీలను పెరిగిన పెట్టుబడులు, కరెంట్ చార్జీలు, హమాలీ చార్జీలకు అనుగుణంగా రూ.10 నుంచి రూ.150కి పెంచాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 60 కిలోల బియ్యం ఇవ్వడం సాధ్యమవుతుందని, దీనిపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి రైస్‌మిల్లుల్లోనే టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తే అంతే తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ధర్నాలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు, రైస్‌మిల్లర్లు లాభిశెట్టి శ్రీనివాస్, వాసవి ప్రణయ్, శ్రీనివాస్ గౌడ్, చిదుర ప్రమోద్, ప్రవీణ్, వెంకన్న, 300 మందికిపైగా రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.
మిల్లింగ్ చార్జీలను రూ.150కి పెంచాలి
ఎఫ్‌సీఐ కఠిన నిబంధనలను
సవరించాలి
రైస్‌మిల్ అసోసియేషన్, రైస్‌మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నా


