● జిల్లాలో ముమ్మరంగా పంట
కుంటల నిర్మాణం
● సవాల్‌గా తీసుకున్న అధికారులు
● 40 రోజుల్లోనే 68 పనులు పూర్తి
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సాగునీటి ఎద్దటి ని వారించడంతోపాటు భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ‘జలసిరి’ కార్యక్రమం ముందుకు సాగుతోంది. రైతుల వ్యవసాయ భూముల్లో పంట కుంటల నిర్మాణాన్ని (ఫామ్ పాండ్) జిల్లా అధికారులు సవాల్‌గా తీసుకుని పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఐదు పంట కుంటలు తవ్వించి జిల్లా వ్యాప్తంగా 2,725 కుంటలు నిర్మించాలని ప్రధాన లక్ష్యం ఉంది. రైతులను మెప్పించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 68 పంట కుంటలను ఉపాధి కూలీలతో తవ్వించి పూర్తి చేయించారు. ఈ పనులు కేవ లం 40 రోజుల్లోనే పూర్తి చేయడం గమనార్హం. మ రో 439 పనులు పురోగతిలో ఉన్నాయి. యంత్రాంగం వేగంగా కదలడంతో వీటిని కూడా త్వరగా పూర్తి చేస్తున్నారు. వందశాతం లక్ష్యాన్ని చేరుకోకపోయినా, సంతృప్తికర స్థాయిలో పంట కుంటలు ని ర్మించే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైతుకు ఉచితం.. కూలీలకు ఉపాధి
సాగు భూముల్లో పంట కుంటలను ప్రభుత్వం రైతులకు ఉచితంగా నిర్మించి ఇస్తోంది. కుంటను స్థానిక ఊరి ఉపాధి కూలీలతో తవ్వించి వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. పంట కుంట సైజు వెడల్పు 12 మీటర్లు, పొడవు 12 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉంటుంది. దీని ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో, నీటి ఎద్దటి సమయాల్లో అత్యవసర సాగునీరందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి రైతులు ఇందులో చేపల పెంపకాన్ని కూడా చేసుకోవచ్చు. మరో అదనపు ఆదాయం కింద పశువుల/గొర్రెల షెడ్డును కూడా నిర్మించుకోవడానికి అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.
రైతులు ముందుకు రావాలి
సాగునీటి కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టిన పంట కుంటలు నిర్మించుకోవడానికి రైతులు ముందుకు రావాలి. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు గ్రామ పరిధిలోని అధికారులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి. రైతుల సహకారంతో లక్ష్యానికి అనుగుణంగా పంట కుంటలను నిర్మిస్తాం.
– సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి


