తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 29 మందికి 29 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కంట్రోలర్ సంపత్‌కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పరీక్షలు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగల కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడ్‌ప్లస్‌లో ఫార్మసిస్టు, ఇతర పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించే ఉద్యోగ మేళాలో పాల్గొనాలని కోరారు.
ఇందల్వాయి: తమ గ్రామానికి వచ్చిన యూరియా బస్తాలను తమ గ్రామ రైతులకే ఇవ్వాలని సిర్నాపల్లి రైతులు ఎరువుల గోదాము ఎదుట టెంట్ వేసుకొని బైఠాయించి బుధవారం నిరసన తెలిపారు. ఆన్‌లైన్‌లో ఉంచిన యూరియా నిరక్షరాస్యులైన రైతులు బుక్ చేసుకునే లోపే అయిపోతుందని పక్క గ్రామాల రైతులు వచ్చి యూరియా తీసుకెళ్తుంటే తమ రైతులు నిస్సహాయంగా చూస్తున్నారని వారు వాపోయారు. పొలానికి యూరియా అందించే సమయం దాటిపోతుందని అదును దాటి ఎరువులు అందిస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరారు.
నిజామాబాద్ రూరల్: సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా నీటి విడుదలకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ నాయకులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలు చెల్లించాలి
బోధన్ టౌన్: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. బుధవారం రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల సంఘం పిలుపు మేరకు పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. గత నాలుగేళ్లుగా కళాశాలలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్
● సినీఫక్కీలో ఎత్తుకెళ్లిన అమ్మాయి
కుటుంబ సభ్యులు
● జగిత్యాల రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు
జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సీతారాంపల్లికి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్‌తోనే పంపించారు. నాటి నుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడి చేసి కావ్యను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


