● జాడలేని వర్షాలు.. ఎండుతున్న పంటలు
● ట్యాంకర్లతో నీరందిస్తున్న రైతులు
మాక్లూర్: వాన జాడ లేక రైతులు సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. 20 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో కనీసం వర్షం పడేవరకై నా ఎండుతున్న పొలాన్ని కాపాడుకుంటే ఆ తర్వాత వర్షపు నీటితో పంట గట్టెక్కుతుందన్న ధీమాతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. మాక్లూర్ మండలంలో మొత్తం 19 వేల ఎకరాల్లో ఆయా రకాల పంటలను సాగు చేస్తుండగా, అందులో అత్యధికంగా వరి పండిస్తున్నారు. జూలై నెలాఖరులో కురిసిన వర్షంతో నీటి అవకాశం లేని రైతులు సైతం హడావిడిగా నాట్లు వేసుకున్నారు. నాటి నుంచి వర్షాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న చిన్న కుంటలు, ఒర్రెల నుంచి నీటిని వాడుకొని పంటలను దక్కించుకున్నారు. ప్రస్తుతం వాటిలో కూడా నీరు అడుగంటిపోవటంతో మండలంలోని చిక్లి, గుంజ్లి, మదన్‌పల్లి, బొంకన్‌పల్లి, ముల్లంగి(బి), వల్లభాపూర్ తదితర గ్రామాల్లో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి.
ఈ చిత్రంలోని రైతు పేరు పంగెర చిన్న రాజన్న. మాక్లూర్ మండలం చిక్లి గ్రామం. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఆశించిన వర్షాలు కురువకపోవడంతో నేల నెర్రలుబారుతోంది. దీంతో పంటను కాపాడుకోడానికి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. అయితే, గుత్ప లిఫ్ట్ ఆయకట్టు చివరి భాగంలో ఉన్న ఈ పొలానికి నీరు చేరాలంటే కాలువలు నిండుగా ప్రవహించాల్సి ఉంటుందని రాజన్న చెబుతున్నాడు.
చివరి ఆయకట్టు వరకు అందించాలి
వర్షం పడే సూచనలు కన్పించినట్టే కన్పించి మాయం అవుతున్నాయి. గుత్ప ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలి. లేకపోతే మా గ్రామ శివారులోని 150 ఎకరాల మేర పంటలు ఎండిపోతాయి.
– పంగెర చిన్న రాజన్న, రైతు, చిక్లి


