నాలుగైదు రోజుల్లో అమలు
ఖలీల్‌వాడి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హాజరు పర్యవేక్షణకు గత విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్)కు బ్రేక్ పడింది. సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది హాజరును డిజిటల్‌గా నమోదు చేసేందుకు తీసుకొచ్చిన విధానం ఏడాదికే నిలిచిపోయింది. 2026–27 విద్యాసంవత్సరంలో ఎస్‌ఆర్‌ఎస్ అమలు చేయకపోవడంతో జూనియర్ కాలేజీల్లో మళ్లీ పాత పద్ధతిలో రిజిస్టర్లలోనే హాజరు నమోదు చేస్తున్నారు.
గత విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేశారు. జిల్లాలో సుమారు 260 మంది ఫ్యాకల్టీ, సిబ్బంది, ఫస్ట్ ఇయర్‌లో 4,331 మంది, సెకండ్ ఇయర్‌లో 3,300 మంది విద్యార్థులకు ఈ విధానం అమలైంది. ఫేషియల్ అటెండెన్స్ అందుబాటులో ఉండటంతో విద్యార్థులు, లెక్చరర్ల హాజరుపై పర్యవేక్షణ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
మళ్లీ పాత పద్ధతిలో..
గతేడాది ఎఫ్‌ఆర్‌ఎస్ నిర్వహించిన ఏజెన్సీతో ఇంటర్ విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరం కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయలేదు. దీంతో జూన్ నెలాఖరు నుంచి యాప్ పనిచేయడం లేదని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా డిజిటల్ హాజరు నమోదు, పర్యవేక్షణ పూర్తిగా నిలిచిపోయింది. ఫేషియల్ అటెండెన్స్ నిలిచిపోవడంతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది మళ్లీ రిజిస్టర్లలో హాజరు వేస్తున్నారు. డిజిటల్ పర్యవేక్షణ లేకపోవడంతో హాజరు విషయంలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్ బోర్డు నుంచి నాలుగైదు రోజుల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అనుమతి వస్తుంది. దీంతో విద్యార్థులు, లెక్చరర్లకు అమలు చేస్తాం. లెక్చరర్లు, సిబ్బంది కాలేజీలకు క్రమం తప్పకుండా హాజరు అవుతున్నారు.
– రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్
జూన్ నుంచి మళ్లీ రిజస్టర్లలోనే హాజరు
ఎఫ్‌ఆర్‌ఎస్ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయని ఇంటర్ విద్యాశాఖ
ఏడాదికే నిలిచిన డిజిటల్
అటెండెన్స్ విధానం
విద్యార్థులు, లెక్చరర్ల హాజరుపై
తగ్గిన పర్యవేక్షణ


