వర్ని: మండలంలోని నారాయణపురం గ్రామ శివారులో భోగవల్లి రఘు(36) అనే యువకుడు పంట కాలువలో పడి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రఘు మతిస్థిమితం లేక గ్రామాల్లో తిరుతుంటాడు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నీటి తొట్టెలో పడి ఒకరు..
రెంజల్: ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఒకరు మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై గంగాధర్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలంలోని కిసాన్‌తండా గ్రామానికి చెందిన జరుపుల హేమ్లా(58) తన ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలో పడిపోయిన అన్నం ప్లేట్‌ను బయటకు తీసే క్రమంలో జారి అందులో పడిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన నీట మునగడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
వేములవాడ: వేములవాడ పట్టణంలోని గుడిచెరువు కట్టకింది బస్టాండు ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఢీకొంది. ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణహాని కలుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


