పాపన్నపేట(మెదక్): నమ్మించి, అధిక వడ్డీల ఆశ చూపి సుమారు రూ.2.20 కోట్లతో ఓ వ్యాపారి ఉడాయించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చిత్రియాల్ చౌరస్తాలో ఆలస్యంగా వెలుగు చూసింది. అత్తకు తెలియకుండా.. కోడళ్ల వద్ద, తండ్రికి తెలియకుండా.. కొడుకుల వద్ద ఇలా అందిన కాడికి దండుకొని సుమారు 80 మందికి టోకరా పెట్టాడు. దీంతో బాధితులు రెండు నెలలుగా అతని కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతం దంపతులు 2022లో పాపన్నపేట మండలం చిత్రియాల్ చౌరస్తాలో కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. అందరితో ఆత్మీయంగా మాట్లాడే దంపతులు అనతి కాలంలోనే, స్థానికుల నమ్మకాన్ని చూరగొన్నారు. చే బదుళ్లతో మొదలైన వ్యవహారం, అప్పుల వరకు వెళ్లింది. నూటికి రూ.3 వరకు ఠంచన్‌గా నెల నెలా వడ్డీ చెల్లిస్తుండటంతో, ఆశలో పడిన స్థానికులు, అప్పులిచ్చారు. ఇలా అనతి కాలంలోనే 80 మంది వద్ద సుమారు రూ.2.20 కోట్ల వరకు అప్పులు తీసుకొని, ఇల్లు, వరికోత మిషన్, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. కానీ ఆస్తులేవీ అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకోలేనట్లు తెలుస్తోంది. ఒక్క ఇల్లు మాత్రం భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. చిత్రియాల్‌కు చెందిన ఒకే కులస్తుల నుంచి సుమారు రూ.40 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. గ్రూపుగా ఏర్పడి పెట్టుకున్న చిట్టీ డబ్బులు కూడా ఎత్తుకున్నట్లు తెలిసింది. గాజులగూడెంకు చెందిన ఓ మహిళ భర్త చనిపోతే వచ్చిన రూ.5 లక్షలు కూడా అతని చేతిలో పెట్టినట్లు సమాచారం. కొంత మంది మహిళలు వడ్డీపై ఆశతో కాళ్ల కడియాలు, పట్ట గొలుసులు అమ్మి సదరు వ్యాపారికి అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. రెండు నెలలుగా అతని జాడ తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వ్యాపారి గతంలోనూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైతం ఇలా అప్పులు చేసి, బిచానా ఎత్తేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
● సుమారు 2.20 కోట్లతో వ్యాపారి పరారీ
● లబోదిబోమంటున్న
80 మంది బాధితులు


