● నేడు శ్రీకృష్ణాష్టమి
● వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు
నిర్వహించనున్న భక్తులు
నిజామాబాద్ రూరల్: ప్రజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పుట్టిన రోజు పండుగను నేడు (శ్రువారం) శ్రావణ మాసం బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ద్వాపరయుగంలో ఈ పర్వదినాన కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి, గృహాన్ని, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుని మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు వరిపిండితో కృష్ణుడి చిన్ని పాదాలను ముద్రించడం ఇక్కడి ప్రత్యేకత. ఇతర పూజలకు భిన్నంగా శ్రీకృష్ణాష్టమి పూజా కార్యక్రమాలను చాలావరకు మధ్యాహ్నం ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తోంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, అటుకులు, చలిమిడి, సున్ని ఉండలు, ఆవు పాలు అలాగే ఐదు మధుర పదార్థాలతో కూడిన పంచ ఖజ్జాయాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
పవిత్ర దినాన కన్నయ్యను భక్తితో పూజిస్తే సమస్త పాపాలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పలుచోట్ల స్వామివారికి 56 రకాల భోగ్‌లను నైవేద్యాలుగా సమర్పిస్తారు. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిపై తులసి దళాలను ఉంచడం మాత్రం తప్పనిసరి. ఇక సాయంత్రం వేళ వాడవాడలా ’ఉట్టి కొట్టే’ వేడుకలు కోలాహలంగా సాగుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికల వస్త్రధారణలతో ముస్తాబు చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ పవిత్ర రోజున భాగవతంలోని దశమ స్కంధాన్ని పారాయణం చేయడం, అష్టోత్తర శతనామ సహస్రనామ పూజలు చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. నగరంలో ఉత్సవాలకు శ్రీకృష్ణాలయం, పెద్దబజార్‌లోని కృష్ణమందిరం ఆలయాలను ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.


