నిజామాబాద్ అర్బన్: పెండింగ్‌లో ఉన్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జే ఏసీ, డీఎస్‌పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భుజరంగరావుకు వినతిప్రతం అందజేశారు. అలాగే డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జపాన్ పర్యటనను రద్దుచేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్ ప్రజావాణిలో వినతిప్రతం సమర్పించారు. శ్రీనివాస్‌పై ఆర్థిక, పరిపాలన అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆయనను జపాన్ పర్యటన నుంచి తప్పించాలన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని కొందరు కార్మికులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నెళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.


