కబ్జా కోరల్లో డిస్ట్రిబ్యూటరీ కాలువ | - | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో డిస్ట్రిబ్యూటరీ కాలువ

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

సాగునీరు అందక నష్టపోతున్న రైతులు

ముసలి కుంట చెరువు అలుగు

కబ్జా చేసి నిర్మాణాలు

పట్టించుకోని అధికారులు

మాక్లూర్‌: మండలంలోని దాస్‌నగర్‌ వద్ద ఉన్న నిజాంసాగర్‌ ప్రధాన కాలువ అయిన 68వ డిస్ట్రిబ్యూటరీ కాలువ కబ్జాకు గురైంది. కొందరు వెంచర్‌ యజమానులు కాలువను కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువ కబ్జాతో ముసలికుంట – బొమ్మకుంట చెరువు ప్రాంతాల్లోని పంటలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువ నుంచి ప్రారంభమయ్యే 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి రెండు పిల్ల కాలువలు ఉన్నాయి. దాస్‌నగర్‌ వద్ద ప్రస్తుత పోలీస్‌స్టేషన్‌ వెనుక నుంచి వెళ్లే పిల్ల కాలువ ద్వారా బోర్గాం(కె) శివారులోని ముసలికుంట చెరువు, బొమ్మ కుంట చెరువులు నిండి తద్వారా సుమారు 150 ఎకారలకు సాగు నీరంది రెండు పంటలు పండేవి. ప్రస్తుతం 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి వచ్చే పిల్ల కాలువను ఓ వెంచర్‌ యజమాని పూర్తిగా మట్టితో పూడ్చి ప్లాట్లు చేసి ప్రహారి నిర్మించటంతో ఈ రెండు చెరువులకు నీరందక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అదే విధంగా ముసలికుంట చెరువు అలుగు ప్రాంతంలో సుమారు 30 గుంటల భూమిని ఓ ప్రైవేట్‌ వ్యక్తి కబ్జాచేసి ఏకంగా షటర్లు నిర్మించి అద్దె కు ఇస్తున్నా సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు ప ట్టించుకోవడం లేదని బోర్గాం(కె) ప్రజలు మండిపడుతున్నారు. అలాగే 68వ డిస్ట్రిబ్యూటరీ మరో పిల్ల కాలువ ద్వారా మాణిక్‌బండార్‌ ఖాన్‌ చెరువు నిండి తద్వారా మాణిక్‌బండార్‌ రైతులకు సంబంధించి వేసంగి 35 ఎకరాలు, వర్షాకాలం 50 ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. ఈ పిల్ల కాలువ కూడా పూర్తిగా క బ్జాకు గురై 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి వచ్చే నిజాంసాగర్‌ నీరు ఖాన్‌ చెరువుకు అందక స్థానిక రైతులు ఏ ఒక్క పంటను కూడా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. కాలువలపైనే వ్యాపార సముదాయాలు నిర్మించి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జాల విషయమై ఈ నెల 28న స్థానిక రెండో డివిజన్‌ కార్పొరేటర్‌ మారంపల్లి మోహన్‌ ఇరిగేషన్‌ డీఈ రవికుమార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జా భూములపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కబ్జాలపై విచారణ చేస్తున్నాం

ఇరిగేషన్‌ భూముల కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను విచారిస్తున్నాం. సర్వే కోసం మాక్లూర్‌ తహసీల్దార్‌కు విన్నవించారు. ఇరిగేషన్‌ ఏఈఈ సాగర్‌ జరిగిన కబ్జాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు. – రవికుమార్‌, ఇరిగేషన్‌ డీఈ, నందిపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement