● ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు
మోపాల్: ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోపాల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కంజర్ గ్రామశివారులో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. కాపర్ కాయిల్స్‌తో వెళ్తున్న ట్రాలీ వాహనం కనిపించింది. అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు వెలుగులోకి వచ్చాయి.
పగటి పూట రెక్కీ.. రాత్రి పూట చోరీ..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన కడారి రవీందర్, నిజామాబాద్ జిల్లా ఇంద్రాపూర్ కాలనీకి చెందిన బంగారు కళ్ల మహేశ్, మందా దీపక్, అడవు ఆకాశ్, సాయినగర్‌కు చెందిన అగుల్ల రాజేశ్, సిద్ధార్థనగర్‌కు చెందిన సనం చంద్రకాంత్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట ట్రాన్స్‌ఫార్మర్ల రెక్కీ నిర్వహించేవారు. రాత్రివేళల్లో జీప్, ట్రాలీ వాహనాల్లో వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ కాయిల్స్, ఆయిల్‌ను దొంగిలించేవారు. వీటిని ప్రధానంగా కడారి రవీందర్ ద్వారా హైదరాబాద్‌లోని దక్కన్ ట్రేడర్స్ సంస్థకు చెందిన ఎంఏ నఫే అన్సారీకి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్నిసార్లు కాపర్ కాయిల్స్‌ను కరీంనగర్‌కు చెందిన నూనె విష్ణుకు కూడా విక్రయించినట్లు నిందితులు చెప్పారని ఎస్సై తెలిపారు. వీరిపై మోపాల్, మాక్లూర్, డిచ్‌పల్లి, నవీపే ట్, వర్ని, నిజామాబాద్ రూరల్, భీంగల్, జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసు లు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుల నుంచి సుమారు 10 కిలోల కాపర్ వైర్, కాయిల్స్, అశోక్ లేలాండ్ వాహనం, టాటా జీప్, ట్రాలీ, కట్టర్, 13 ఇనుప పానలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ సీఐ ఏ సురేశ్, సీసీ ఇన్‌స్పెక్టర్ డీ సాయినాథ్, సీసీఎస్ టీమ్ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రాం, కానిస్టేబుళ్లు అప్సర్, సర్దార్, వసీం, నరేశ్‌ను సీపీ సాయిచైతన్య అభినందించారు.


