ఆపరేషన్‌ చేస్తుండగా మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ చేస్తుండగా మహిళ మృతి

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఘటన

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని

బంధువుల ఆందోళన

కామారెడ్డి టౌన్‌: గర్భసంచి తొలగింపు ఆపరేషన్‌ జరుగుతుండగా మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకోగా, వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండల కేంద్రానికి చెందిన పరిష రాజేశ్వరి అలియాస్‌ లాస్య (42)కు భర్త నరేందర్‌, తొమ్మిదేళ్ల కుమార్తె శ్రీవల్లి, ఐదేళ్ల కుమారుడు వైభవ్‌ ఉన్నారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యానికి గురికావడంతో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు గర్భసంచి తొలగించే ఆపరేషన్‌ చేయించుకోవడానికి కామారెడ్డిలోని జీవధాన్‌ ఆస్పత్రిలో రాజేశ్వరి మంగళవారం తన భర్త, అత్త, తల్లితో కలిసి వచ్చి అడ్మిట్‌ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లిన వైద్యులు, సిబ్బంది కొద్దిసేపటికే రాజేశ్వరి మృతిచెందిందని కుటుంబసభ్యులకు తెలిపారు. మత్తు(అనస్తీషియా) ఇంజక్షన్‌ ఇవ్వగానే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, కేస్‌షీట్‌ రాయకుండా, కుటుంబసభ్యుల సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్‌ థియేటర్‌కు ఎలా తీసుకువెళ్లారని బంధువులు ప్రశ్నించారు. పెద్ద ఎత్తున బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చి, ఆందోళనకారులను సముదాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement