బోధన్: ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువులు విక్రయించిన డబ్బులు రూ.28 లక్షలు దుర్వినియోగంపై సహకార శాఖ అధికారులు స్పందించారు. వాస్తవాలు తేల్చేందుకు ఆ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతిని విచారణ కు ప్రత్యేక అధికారిణిగా నియమించారు. ఈ నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ప్రత్యేక అధికారిణి రమావతి విచారణ ప్రారంభించారు. అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, డైరెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పోల మ ల్కారెడ్డి మాట్లాడుతూ ఎరువుల డబ్బులు దుర్వినియోగం విషయంలో బాధ్యుల నుంచి ఆ డబ్బుల ను కచ్చితంగా రికవరీ చేస్తామన్నారు. పాలకవర్గం ఆమోదంతో బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రత్యేక అధికారిణి తెలిపారు.


