ఖలీల్‌వాడి: ప్రయివేటు పాఠశాలలకు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహాగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణహత్యను ఖండిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీ సాయిచైతన్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూపారెడ్డి హత్యకు గురైన ఘటన విద్యారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి ఘటనలతో విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయాందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. రూపారెడ్డి హత్య కేసును అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా సెక్రెటరీ అరుణ్, కోశాధికారి ఉప్పల మధు, ప్రతినిధులు నరసింహారావు, మోహన్, జనార్దన్, పృథ్వీ, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


