డీపీలతో జర జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

డీపీలతో జర జాగ్రత్త

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

కేసులు సైతం పెరుగుతున్నాయి

నాకేం కాదు అనుకోవద్దు

సెల్ఫ్‌ ఐడెంటిటీ కోసం పాకులాడుతూ ఇక్కట్లు తెచ్చుకుంటున్న మహిళలు

ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, బ్లాక్‌

మెయిల్‌కు పాల్పడుతున్న కేటుగాళ్లు

ఆర్మూర్‌: వాట్సాప్‌ స్టేటస్‌, ప్రొఫైల్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌), ప్రొఫైల్‌ పిక్చర్‌ పెట్టేటప్పుడు జర జాగ్రత్తగా ఉండటం అవసరమని సాంకేతికరంగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెట్టే తమ డీపీలను కొందరు కేటుగాళ్లు సేకరించి, మార్ఫింగ్‌ చేసి, వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోనూ పెరిగిపోతున్నాయి.

ఏఐ రాకతో పెరిగిన సమస్యలు

విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సెల్ఫ్‌ ఐడెంటిటీ మోజులో పడి తమ వారికి తమ ఆక్టివిటీని చూపించుకోవడం కోసం తమ ఫొటోలు, కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతోపాటు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. తాము చేస్తున్న పనిని, తమ అందాన్ని ఎదుటి వారు గుర్తించాలంటూ సెల్ఫ్‌ ఐడెంటిటీ కోసం పాకులాడుతున్న కొందరు మహిళలు, విద్యార్థినులు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు కేటుగాళ్లు వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, బ్లాక్‌మెయిల్‌, వేధింపులు, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో లైక్‌లు తాత్కాలికం కానీ మార్ఫ్‌ అయిన ఫొటో జీవితాంతం వెంటాడుతుంది. వీటిపై ఫిర్యాదు చేయడానికి చాలామంది జంకుతున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే ఎక్కడ తమ కుటుంబ పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫోన్‌ నంబర్లను మార్చి తాత్కాలికంగా సమస్య నుంచి తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నా..

సైబర్‌ నిపుణులు, పోలీస్‌ శాఖ అధికారులు సమయానుకూలంగా మహిళలు, విద్యార్థినులకు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో తప్ప సెల్ఫీ ఫొటోలు వాట్సాప్‌ స్టేటస్‌లో, సోషల్‌ మీడియాల్లో పెట్టవద్దని సూచిస్తున్నారు. ఒక వేళ తప్పనిసరైతే తమ ముఖం క్లియర్‌గా కనిపించే ఫొటోలు పెట్టకుండా ఫిల్టర్‌ వాడాలని సూచిస్తున్నారు. ప్రైవసీ, ఓన్లీ మై కాంటాక్ట్స్‌ పెట్టుకోవడం వల్ల సమస్యను కొంత మేర తగ్గించుకోవచ్చు. తెలియని వారికి అస్సలు షేర్‌ చేయొద్దు. కొందరు మహిళలు తమ వాట్సాప్‌ స్టేటస్‌ కేవలం తమ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కు మాత్రమే వెళ్తుంది కదా.. సమస్య ఏమీలేదనుకుంటారు. కానీ విద్యార్థినులు, మహిళలు ఎక్కువగా తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులతోనే వేధింపులకు గురవుతారన్న సత్యం వారికి తెలియదు. తమ కాంటాక్ట్‌లో ఉన్న ఎవరో ఒకరు చెడు బుద్ధిని చూపించినా సమస్య ఉత్పన్నం కాక మానదు. ఈనేపథ్యంలో మహిళలు, విద్యార్థినులు, యువత డీపీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.

ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి తన రోజు వారి కార్యక్రమాలను సెల్ఫీ

తీసుకొని వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడం అలవాటు. ఇటీవల ఆమె ఫొటోలను స్క్రీన్‌ షాట్‌ తీసిన ఒక వ్యక్తి మార్ఫింగ్‌ చేసి, మరో ఫోన్‌ ద్వారా ఆమెకే పంపించి బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నం చేశాడు. సదరు మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఫోన్‌ నంబర్‌ మార్చడంతో

తాత్కాలికంగా సమస్య నుంచి బయట పడింది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు చాలా మంది

మహిళలకు ఎదురవుతున్నాయి.

విద్యార్థినులు సోషల్‌ మీడియాలో పోస్టు చేసే ఫొటోల కారణంగా వేధింపులు పెరిగి పోక్సో కేసులు సైతం పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ తమ పిల్లలకు సైతం జాగ్రత్తలు చెప్పడం మంచిది.

– సుహాసిని, ఎస్సై, మెండోర

మహిళలు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో నాకేం కాదు అనుకోవద్దు. ఒక్కసారి మార్ఫ్‌ అయితే కుటుంబం, ఉద్యోగాల్లో సమస్యలు వచ్చి మానసికంగా దెబ్బతినాల్సి వస్తుంది. కాబట్టి తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలి.

–వెంకటేశ్వర్‌రెడ్డి, ఏసీపీ, ఆర్మూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement