● అధికారులు హెచ్చరిస్తున్నా మారని తీరు
● గుచ్చుకుంటే ప్రమాదమని
భయపడుతున్న ప్రజలు
నందిపేట్: మండల కేంద్రంలో వాడిన సిరంజీలు రోడ్లపై విచ్చలవిడిగా పడి ఉండడంపై ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. నందిపేటలోని వాల్గోట్ బంగ్లా సమీపంలో శుక్రవారం రోడ్డుపై వాడిన సిరంజీలు, సూదులు విచ్చల విడిగా పడి ఉండటం కనిపించాయి. గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద ఉదయాన్నే వాడిన సిరంజీలు, సూదులు రోడ్డుపై పడి ఉండడం చూసి స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్‌ఎంపీ, పీఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి వాడిన సూదులు, సిరంజీలు రోడ్డుపై పారవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మారని తీరు..
ఆస్పత్రుల్లో ఉపయోగించే ఈ ఇంజక్షన్లు, సిరంజీలు, సూదులు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్‌లో వేసి జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. కానీ నందిపేట మండల కేంద్రంలో మాత్రం విచ్చల విడిగా పీఎంపీ, ఆర్‌ఎంపీల పేరిట గల్లీకో దవాఖాన పేరుతో ఏర్పడ్డాయి. కనీసం మెడికల్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపైన వాడిన సూదులు, సిరంజీలను విచ్చల విడిగా రోడ్లపై పారేయడం తగదు. అధికారులు హెచ్చరించినా వారి తీరులో మార్పు కనబడడం లేదు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. పిల్లలు, పెద్దలు ఆదమరిచి నడిస్తే అవి గుచ్చుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


