అటవీశాఖపై విజిలెన్స్‌ కన్ను! | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖపై విజిలెన్స్‌ కన్ను!

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా అటవీ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర శాఖకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్నాయి. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, విజిలెన్స్‌ టీమ్‌లు జిల్లాకు వచ్చి ఆరోపణలున్న అధికారులు, సిబ్బందిపై విచారణ చేస్తుండడంపై అటవీ శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడం శాఖను కుదిపేస్తున్నాయి. అయితే, జిల్లాలో పని చేసి బదిలీపై వెళ్లిన ఒక రేంజ్‌ ఆఫీసర్‌ మీద రెండు నెలల క్రితం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విచారణ చేపట్టారు. అదే అధికారిపై విజిలెన్స్‌ అధికారులు వారం కిందట జిల్లాకు వచ్చి విచారణ చేశారు. సదరు అధికారి పని చేసిన రేంజ్‌లో విలువైన అటవీ భూముల కబ్జాకు సహకరించి భారీగా డబ్బులు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై పీసీసీఎఫ్‌కు ఫిర్యాదులు వెళ్లడంతోనే విజిలెన్స్‌ బృందం ఇటీవల రంగంలోకి దిగి లోతైనా విచారణ చేపట్టారు. అలాగే గతంలో పని చేసిన ఓ డిప్యూటీ ఎఫ్‌ఆర్వో మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉండడంతో ఆయన పని చేసిన పరిధిలో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్వో, డీఆర్వోలు చేతులు కలిపి అటవీ భూముల కబ్జాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

బొగ్గు బట్టీ విషయంలోనూ..

నిజామాబాద్‌ నార్త్‌ రేంజ్‌లో రెంజల్‌ మండలం నీల గ్రామ శివారులో నిబంధనలు అతిక్రమించి బొగ్గుబట్టీని నిర్వహిస్తున్న విషయంలోనూ పీసీసీఎఫ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు బొగ్గుబట్టీని, జానకంపేట్‌లో ఉన్న బొగ్గు గోదామును తనిఖీ చేశారు. బొగ్గు బట్టీలో నిబంధనలకు విరుద్ధంగా పది రకాల కలప ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పరిమితికి మించి కట్టె డంపులు ఉండటాన్ని గమనించారు. బొగ్గుబట్టీని నిర్వహిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, వ్యాపారులతో చేతులు కలిపిన స్థానిక అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా సమాచారం. చెట్లను అడ్డగోలుగా నరికివేస్తూ బొగ్గు బట్టీకి వినియోగిస్తున్నా స్థానిక అటవీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్ర నుంచి రవాణా జరిగితే చెక్‌ పోస్టుల్లో ఎందుకు అడ్డుకోలేదు, బట్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకు తనిఖీ చేయలేదనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

జిల్లా నుంచి రాష్ట్ర శాఖకు వెళ్లిన ఫిర్యాదులు

గతంలో పని చేసిన ఓ రేంజ్‌ ఆఫీసర్‌పై ఇటీవల విచారణ

అటవీ భూముల్లో అవినీతికి

పాల్పడినట్లుగా ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement