నిజం నిగ్గుతేలేనా..? | - | Sakshi
Sakshi News home page

నిజం నిగ్గుతేలేనా..?

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదాస్పద నియామకాలపై జాతీయ ఎస్టీ కమిషన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విచారణ చేపట్టనుండడంతో ఉత్కంఠ నెలకొంది. కమిషన్‌ ఎదుట తెయూ ఉన్నతాధికారులు, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, నియామకాలపై కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు హాజరు కానున్నారు. అధ్యాపకుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించలేదని, రోస్టర్‌ పాయింట్ల గందళగోళం వల్ల తనకు అన్యాయం జరిగిందని వెంకట్‌నాయక్‌ అనే వ్యక్తి అందజేసిన ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ కమిషన్‌ ఈ నెల 3వ తేదీన నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2012 (2013–14) నాటి నియామక ప్రక్రియపై ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ, రిటైర్డ్‌ జడ్జ్‌ సీవీ రాములు నివేదికలు, తెలంగాణ హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు, పాలకమండలి తీర్మానాలు, ఇతర వివరాలను వర్సిటీ ఉన్నతాధికారులు ఎస్టీ కమిషన్‌ కమిషనర్‌కు చూపిస్తారా.. లేదా గోప్యంగా ఉంచుతారా అనేది వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నియామకాల రోస్టర్‌ పాయింట్‌లో తేడా కారణంగా అన్యాయం జరిగిందని వెంకట్‌నాయక్‌ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, కాలేజియేట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 14న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ నోటీసు జారీ చేసింది. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్‌, రోస్టర్‌ పాయింట్‌ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్‌ లిస్ట్‌లతో సహా.. అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని కమిషన్‌ నోటీసులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వద్ద ఉండటం, ఇదే సమయంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ స్వయంగా జోక్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెయూలో వివాదాస్పద నియామకాలపై నేడు విచారణ

జాతీయ ఎస్టీ కమిషన్‌ ఎదుట హాజరు

కానున్న వర్సిటీ ఉన్నతాధికారులు

యూనివర్సిటీవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement