● దివ్యాంగుల సంక్షేమానికి శిబిరాలు విస్తరించాలని వినతి
సుభాష్‌నగర్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్‌ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవల సులభతరంపై ఎంపీ అర్వింద్ కేంద్రమంత్రికి వివరించారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలు విస్తరించాలని కోరారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తిచేశారు. నియోజకవర్గంలో కేంద్ర పథకాలు అర్హులందరికీ చేరేలా పనిచేస్తున్నామని ఎంపీ తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


