రుద్రూర్: డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య ఆదేశించారు. బోధన్ డివిజన్‌లోని పోలీస్ అధికారులతో కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో సీపీ బుధవారం సమావేశమై పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. డ్రగ్స్, గంజాయి, పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణాపై నిరంతర దాడులు నిర్వహించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ మో సాల బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిఘా సారించాలని, పెట్రోలింగ్, వాహన తనిఖీలను ము మ్మరం చేయాలన్నారు.
మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్లను గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏసీపీ పి శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


