నిధులు మంజూరు కాలేదు..
● ప్రభుత్వ పాఠశాలల్లో
కానరాని సైన్స్ పరికరాలు
● ఇన్‌స్పైర్ పోటీల్లో రాణించలేక
పోతున్న విద్యార్థులు
నందిపేట్(ఆర్మూర్): ప్రయివేట్‌కు ధీటుగా ప్రభు త్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ విద్యను అందిచాలనే లక్ష్యంతో ప్రయోగశాలలు ఏర్పాటు చేసినా నిధులు లేమితో లక్ష్యం నీరుగారుతోంది. ఆరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం.. సరిపడా సైన్స్ పరికరాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రయోగ విద్యకు దూరమవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్న పరికరాలతోనే పాఠాలు బోధించి మమ అనిపిసున్నారు.
కొద్దిపాటి పరికరాలు ఉన్నా..
6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులలో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటిని ప్రయోగాల ద్వారా చేసి చూపితేగాని అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2019లో రాష్ట్రీయ మాద్యమిక శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు రూ. 50 వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 22 వేలు విడుదల చేశారు. దీంతో కొద్దిపాటి పరికరాలు కొనుగోలు చేశారు. కానీ కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవిసైతం మూలన పడ్డాయి. మరికొని పాఠశాలల్లో ఉన్న పరికరాలతోపాటు కాలంచెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు.
పోటీలకు దూరం.. ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్ పోటీలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫేర్, ఇన్స్‌స్పైర్ అవార్డుల్లో వెనుకబడుతున్నారు. ప్రతిభ ఉన్నా సరిపడా శిక్షణ, అవగాహన లేక విద్యార్థులు సత్తా చాటలేకపోతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
అయిలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పరికరాలు కొనుగోలు చేస్తాం. విద్యార్థులకు కావాల్సిన కొన్ని సైన్స్ పరికరాలను ఉపాధ్యాయులు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
–అవదూత గంగాధర్, ఎంఈవో, నందిపేట


