ఖలీల్‌వాడి: విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు పాఠశాలల్లో ఉల్లాసభరిత వాతావరణం కో సం విద్యతోపాటు సంగీతం నేర్పించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 40 పీఎంశ్రీ స్కూళ్లను సంగీతం శిక్షణ కోసం ఎంపిక చేసి సంగీత వాయిద్యాలను అందించింది. కానీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌స్ట్రక్టర్లు లేకపోవడంతో వాయిద్యాలు మూలనపడ్డాయి. సంగీత వా యిద్యాలు, నృత్యం నేర్చుకోవాలనే తపన ఎంతో మంది విద్యార్థుల్లో ఉన్నా నిరాశే మిగులుతోంది. సంగీతంపై మక్కువ ఉన్న వారు పట్టణ ప్రాంతాల్లో సంగీత, నృత్య కళాకారుల వద్ద శిక్షణ పొందుతున్నా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రం అటు పాఠశాలల్లో, ఇటు బయట శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్‌గా శిక్షణ పొందాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వెనకడుగు వేస్తున్నారు.
ఎంపిక చేసిన పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలను గతేడాది సరఫరా చేయగా, కొన్ని చోట్టే వీటిని ఉపయోగిస్తున్నారు.
పీఎంశ్రీ నిధుల నుంచి..
జిల్లాలో ఎంపిక చేసిన 40 పీఎంశ్రీ పాఠశాలల్లో వయోలిన్, హార్మోనియం, తబలా, డోలక్ తదితర పరికరాలున్నాయి. ఒక్కో పాఠశాలకు శిక్షకుల వేతనాల కోసం రూ.1.50 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక తరగతి గదిని ఏర్పాటు చేశారు. పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించి, ప్రతి నెలా రూ.10 వేల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్ తప్పనిసరిగా మ్యూజిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. టీచర్లు అందుబాటులో ఉన్న చోట శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. లేని చోట వాయిద్యా పరికరాలు మూలకు చేరాయి. 2026–27 విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యూజిక్ టీచర్లను నియమించలేదు. ఇకనైనా శిక్షకులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదేశాలు రాగానే నియమిస్తాం
గతంలో పని చేసిన మ్యూజిక్ టీచర్లను యథావిధిగా కొనసాగిస్తాం. లేని చోట ప్రకటన ఇస్తాం. విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాగానే నియామకాలు చేపట్టి విద్యార్థులకు సంగీతం, నృత్యంపై శిక్షణ ఇస్తాం. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్
ఇన్‌స్ట్రక్టర్లు లేక
నిరుపయోగంగా..
40 పీఎంశ్రీ
పాఠశాలల్లో మూలకు చేరిన వైనం
పట్టించుకోని
విద్యాశాఖాధికారులు


