● కమాండెంట్ సత్యనారాయణ
● బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞలు
డిచ్‌పల్లి: మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కమాండెంట్ పీ సత్యనారాయణ పేర్కొన్నారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ ఏడో బెటాలియన్ డిచ్‌పల్లిలో నిర్వహించిన ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవం’ కార్యక్రమంలో కమాండెంట్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి తన కుటుంబం, సమాజం, దేశాభివృద్ధి కోసం వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ప్రజలతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే మహోత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సం పోస్టర్లను ఆవిష్కరించారు. అధికారులు, పోలీసు సిబ్బందితో వ్యసనాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వ్యసన విముక్తి దిశగా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు అభిషేక్, సంతోషి, శారద, శ్రీలక్ష్మి, గోపి తదితరులు పాల్గొన్నారు.


