భిక్షను స్వీకరిస్తున్న హనుమాన్ దీక్షాపరులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘ఇందూరు శోభాయాత్ర’. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి పేరెన్నికగన్నది ఈ యాత్ర. ‘అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి’ ద్వారా 1985లో ఏముల నాగభూషణం గురుస్వామి, దేశాయ్ గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో 11 మంది భక్తులు హనుమాన్ దీక్షలు ప్రారంభించారు. ఇక ఈ అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో 1986లో ఇందూరులో ‘హనుమాన్ శోభాయాత్ర’ ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ఈ అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితికి జిల్లాలోని అన్ని మండలాల్లో కన్వీనర్లు ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఏటా చైత్రమాసం నుంచి వైశాఖ మాసంలో హనుమంతుడి పుట్టినరోజు వరకు నలభై రోజులకు పైగా ఈ దీక్షలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని అత్యధిక గ్రామాల్లో హనుమాన్ దీక్షలు చేస్తున్నవారి సంఖ్య 40 వేలకి పైగా చేరుకుంది. ఇక అర్ధ మండల దీక్షలు (21 రోజులు) అయితే 80 వేల మంది వరకు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా 1996 నుంచి మార్చి–ఏప్రిల్ నెలల్లో (ఆంజనేయుడి పుట్టిన రోజుకు 10 రోజుల ముందు) మహిళలు సైతం ఏకాదశి దీక్షలు భారీ సంఖ్యలో చేస్తున్నారు. గ్రామాల్లో అందరూ ఒక్కటే అనేదాన్ని చాటేందుకు భజరంగ్‌దళ్ సైతం ఈ దీక్షల్లో విరివిగా పాల్గొంటున్నారు. మరోవైపు పదేళ్లుగా ఇందూరు నగరంలో ప్రతి మార్చి–ఏప్రిల్ నెలల్లో 45 రోజులపాటు హనుమాన్ దీక్షాధారణ చేసిన భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
● విజయవాడకు చెందిన హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఏర్పాటు అయింది. వారి శిష్యరికంలోనే ఇందూరుకు చెందిన ఏముల నాగభూషణం, దేశాయ్ గంగాధర్ దీక్షలు మొదలుపెట్టారు. వీరిద్దరూ ప్రతి ఏడాది 45 రో జుల నుంచి 90 రోజుల వరకు మాలధారణ దీక్షలు చేస్తూ వస్తున్నారు. పలుసార్లు 108 రోజులపాటు దీక్షలు చేశారు. ఈ దీక్షలతోపాటు ఏటా దేవీనవరాత్రులు, వినాయకచవితి సమయాల్లోనూ 11 రో జుల పాటు దీక్షలు చేస్తూ వస్తున్నారు. పైగా నాగభూషణం గురుస్వామి నిజామాబాద్ డీసీసీబీలో మేనేజర్‌గానూ ఉద్యోగ బాధ్యతలు నిర్విఘ్నంగా ని ర్వహిస్తున్నారు. కాగా, 30 ఏళ్ల కిందటి వరకు జి ల్లాలో హనుమాన్ దీక్షలు చేసేవారిని గ్రామాల పొ లిమేరల్లోనే ఉంచేవారని, ఇప్పుడు కులమతాలకు అతీతంగా ఆదరిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.
కొనసాగుతున్న దీక్షల స్వీకరణ..
ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మండల దీక్ష స్వీకరించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు అర్ధ మండల దీక్ష స్వీకరణ కొనసాగుతోంది. 19 నుంచి 23 వరకు ఏకాదశి దిన దీక్షలను స్వీకరించనున్నారు.
మొదట్లో ముదిరాజ్ హనుమాన్ మందిర్ నుంచి..
1986లో నగరంలో హనుమాన్ శోభాయాత్రను ముదిరాజ్ హనుమాన్ మందిర్ నుంచి గాజుల్‌పేట్ పెద్ద రామమందిర్ వరకు నిర్వహించాం. ప్రస్తుతం కంఠేశ్వర్ ఆలయం నుంచి ఆర్‌ఆర్ చౌరస్తా వరకు నిర్వహిస్తున్నారు. దీక్ష చేసేవారు రోజూ ఒక్కసారే భోజనం తీసుకుంటారు. సింధూరం ధరించి ఆంజనేయుడి గుడిలో ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణామాలు, అభిషేకం, అర్చన, జపం, ధ్యానం, పారాయణం చేసి హారతి తీసుకుంటారు. ప్రతి వ్యక్తిలో హనుమాన్‌ను దర్శించుకోవాలి. – ఏముల నాగభూషణం గురుస్వామి, ఉమ్మడి జిల్లా కన్వీనర్,
అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి
ఇంటింటా హనుమధ్వజం లక్ష్యం..
పదకొండు మందితో ప్రారంభమైన ఈ హనుమాన్ దీక్షలు ప్రస్తుతం జిల్లాలోని వందల గ్రామాల్లో చేస్తున్నారు. దీక్షా సమయాల్లో ప్రతిరోజూ సంకీర్తన కా ర్యక్రమాలు ఉంటాయి. ఇంటింటా హ నుమాన్ చాలీసా పారాయణం, ప్రతి ఇంటిపై హనుమంతుడి జెండా ఉంచేలా ముందుకెళుతున్నాం.
– దేశాయ్ గంగాధర్ గురుస్వామి, నగర కన్వీనర్, అఖిలభారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఇందూరు
జిల్లాలో 41 ఏళ్లుగా కొనసాగుతున్న భక్తుల మాలధారణ
‘అఖిల భారత హనుమాన్ దీక్ష
సేవాసమితి’ ఆధ్వర్యంలో..
ఇందూరులో 11 మందితో మొదలై..
40 వేల మంది వరకు దీక్షలు
మహిళలు సైతం 11 రోజులపాటు
హనుమాన్ ఏకాదశి దీక్ష
1986లో హనుమాన్ శోభాయాత్రకు
అంకురార్పణ


