● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియాన్ని ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేడ్కర్ భవన్‌లను సందర్శించారు. ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న ఆడిటోరియంలో మరమ్మతు లు చేయించాలని సూచించారు. ఆధునీకరణ పనులకు అయ్యే అంచనా వ్యయం, అందుబాటులో ఉన్న నిధులు తదితర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌ను ఆదేశించారు. న్యూ అంబేడ్కర్ భవన్‌లో సైతం మరమ్మతులు చేయించాలన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న ఒక రోజు శిక్షణ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అమృతా గార్డెన్‌ను సందర్శించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు తదితరులున్నారు.
నేటి నుంచి ఇందల్వాయి రైల్వేగేటు మూసివేత
ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో ఉన్న రైల్వేగేటుని అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. భీమ్‌గల్, సిరికొండ, ధర్పల్లి మండలాలతోపాటు గేటు అవతలి ప్రాంతాలకు వెళ్లేవారు తిర్మన్‌పల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల గుండా డిచ్‌పల్లికి చేరుకోవాలని తెలిపారు. కామారెడ్డి వైపు వెళ్లేవారు గౌరారం, నల్లవెల్లి, గన్నారం మీదుగా జాతీయ రహదారి పైకి చేరుకోవాలని సూచించారు.


