● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ప్రత్యేక శిక్షణలో అధికారులకు ఆదేశం
నిజామాబాద్ అర్బన్: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సర్వే వివరాలతోనే ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం అవగాహనకు వస్తుందన్నారు. జనగణన– 2027 ప్రక్రియలో భాగస్వాములయ్యే తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ 2011లో చివరిసారి జనాభా గణన జరిగిందని గుర్తుచేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, కరోనా తీవ్రతతో నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలి దశలో నివాస గృహాలు, అన్నిరకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. రెండో విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జనగణన జరపాల్సి ఉంటుందన్నారు. గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ల వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ అన్నారు. జన గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలన్నారు. ఏ ఒక్కరి వివరాలు బయటికి వెల్ల డి కావని, నేరుగా సర్వర్‌లో నిక్షిప్తమయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము సైతం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.


