డొంకేశ్వర్(ఆర్మూర్): పశువుల ఆరోగ్యంతోనే ప్రజారోగ్యం ముగిపడి ఉంది. వాటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకొని ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. అయితే, పశువులకు వ్యాపించే ప్రాణాంతకమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గాలికుంటు వ్యాధి. గాలి ద్వారా వేగంగా వ్యాపించే దీనిని నివారించేందుకు భారత ప్రభుత్వం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను ఏడాదిలో రెండుసార్లు ఉచితంగా వేయిస్తోంది. మన జిల్లాలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 9 వరకు పశుసవంర్ధక శాఖ నిర్వహిస్తోంది. జిల్లాలో ఆవులు, గేదెలు, ఎద్దులు కలిపి 1.79 లక్షలు ఉన్నాయి. పశువైద్య అధికారులు, సిబ్బంది పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పశువులకు టీకాలు వేస్తున్నారు. పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టీకాలు వేయించకపోతే పశువులకే కాకుండా రైతులకు, ప్రజలకు చాలా నష్టాలు జరిగే అవకాశముందంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో గొర్రెలు, మేకలు, పందులు పెంచే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎందుకు వస్తుంది..?
● ఈ వ్యాధి పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన ఆఫ్తో వైరస్ ద్వారా వస్తుంది. గాలి ద్వారా ఒక పశువు నుంచి మరొక పశువుకు సులభంగా వ్యాపిస్తుంది.
● కలుషిత నీరు, ఆహారం (మేత, దాణా) ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లాలాజలం, మలమూత్రాలతో కూడా వస్తుంది. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యంగా ఉన్న పశువులతో కలిపి ఉంచడంతో సంక్రమిస్తుంది.
● వ్యాధి సోకిన తల్లిపాలు తాగడంతో దూడలకు సోకుతుంది. పశు సంరక్షకుల బట్టలు, చెప్పులు, చేతుల ద్వారా వైరస్ ఒకచోటి నుంచి మరో చోటికి వ్యాపిస్తుంది.
ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌లో దూడలకు టీకాలు వేస్తున్న పశువైద్య అధికారులు
వ్యాధితో పశువులకు కలిగే నష్టాలు
పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
ఎద్దులు, దుక్కి పశువుల కాళ్లు కుంటు పడడంతో అవి పొలం పనులకు పనికిరావు.
లేత వయసు గల దూడలలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.
చూడి (గర్భంతో ఉన్న) పశువులలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
పశువుల నోటిలో పుండ్లు ఏర్పడటంతో అవి సరిగ్గా తినలేవు. దీంతో విపరీతమైన నీరసం, బరువు తగ్గుతాయి.
కోలుకున్న తర్వాత కూడా కొన్ని పశువులలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది, వెంట్రుకలు గరుకుగా మారడం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి.
టీకాలు ఇప్పిస్తే ఉపశమనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పాడి పోషకులు సద్వినియోగం చేసుకోవాలి. టీకాలు ఇప్పిస్తే పశువులకు వ్యాధి వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగడంతోపాటు పాడి రైతులకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది.
– బస్వారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
జిల్లాలో మొదలైన గాలికుంటు
నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ
పాడి రైతులు సద్వినియోగం
చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్న పశుసంవర్ధక శాఖ
పశువుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ప్రజారోగ్యం


