సుభాష్‌నగర్: వేతనాలు అందక గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం.. అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఈ–పంచాయతీ ఆపరేటర్లలో మరింత ఆందోళన మొదలైంది. అదనపు పనిభారం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్ మంత్రి సహా ఆ శాఖ ఉన్నతాధికారులకు, డీపీవోలకు వినతిపత్రాలు అందజేసినా ఆశించిన ఫలితం రావడంలేదని వారు వాపోతున్నారు. సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్ధేశంతో ఈ–పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 94 మంది ఆపరేటర్లను నియమించింది. మండలానికి ముగ్గురు, నలుగురు చొప్పున మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో ఒక్కో ఆపరేటర్‌కు రూ.19,500 వేతనం చెల్లించేవారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా చెల్లించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్‌లైన్ చేస్తున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా వేతనాల చెల్లింపు విషయమై డీపీవో శ్రీనివాస్‌రావు వివరణ కోరగా.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిలో ఉందని, ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసిందని సమాధానమిచ్చారు.
అదనపు పనిభారంతో సతమతం
గ్రామపంచాయతీ పనులతోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నిరకాల పనులను ప్రభుత్వం ఈ–ఆపరేటర్లతో చేయిస్తోంది. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్సు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతో పాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం
వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వేతనాలు, డిమాండ్ల పరిష్కారం కోసం డీపీవోను కలిసి వినతిపత్రం అందజేశాం. మేము ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉద్యోగ భద్రత, డిమాండ్లపై రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం.
– సురేశ్, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు..
ఐదు నెలలుగా ఈ–పంచాయతీ
ఆపరేటర్లకు అందని జీతాలు
‘అవుట్‌సోర్సింగ్’ సిబ్బంది
తొలగింపుతో ఆందోళన
సమస్య పరిష్కరించాలని
ఉన్నతాధికారులకు వినతి


