తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం 107 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్‌క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,905 మందికి 1,798 మంది హాజరు కాగా 107 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు
సుభాష్‌నగర్: పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపే అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్‌పీడీసీఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో నేటికీ విద్యుత్ కనెక్షన్ లేని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 378 అంగన్‌వాడీలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే పనుల దిశగా విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని, ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. విద్యుత్ వెలుగులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటర్లు, తదితర పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని ఎస్‌ఈ తెలిపారు.
పెర్కిట్(ఆర్మూర్): మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో రా జశ్రీ సూచించారు. ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బుధవారం అధికారులు గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్‌వో హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్ల మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సమతా, ఎస్సై అప్పారావు, కార్యదర్శి నసీర్, మహిళ సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సబ్ సెంటర్ తనిఖీ
మాక్లూర్: ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గుత్ప ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్‌ను డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు వేస్తున్న టీకాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సెంటర్‌లోని రికార్డులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు.


