పసుపు ధరలపై ఆశలు
మోర్తాడ్(బాల్కొండ): పసుపునకు అంతర్జాతీయ మార్కెట్(కమోడిటీ)లో ధర పెరగడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో క్వింటాల్ ధర రూ.2 వేలు పెరిగింది. మొన్నటి వరకు రూ.12 వేల నుంచి రూ.13 వేలు ఉన్న క్వింటాల్ పసుపు ధర ఒకేసారి రూ.15 వేలకు చేరింది. కమోడిటీలో రూ.17 వేలుగా నమోదైంది. ఈ సీజన్‌కు సంబంధించి పసుపు తవ్వకాలకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవ్వకం తరువాత ఉడికించి ఆరబెట్టాల్సి ఉంటుంది. మరో పక్షం రోజుల్లో పసుపును మార్కెట్‌లో విక్రయించే అవకాశాలు ఉన్న తరుణంలో ధర ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ధర నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. గత సీజన్‌లో రూ.12 వేల వరకే ధర లభించింది. పెట్టుబడులు పెరగడంతో ధర కనీసం రూ.16వేలకు పైగా లభిస్తేనే తమకు ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, ఎగుమతులపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో మన పసుపునకు డిమాండ్ ఏర్పడితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈసారి జిల్లాలో 20వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. పదేళ్ల కింద కనీసం సాగు విస్తీర్ణం 50వేల ఎకరాల వరకు ఉండేది. పెట్టుబడులు పెరిగడం, మార్కెట్‌లో ధర లేకపోవడంతో నష్టపోతున్నామనే కారణంతో అనేక మంది రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ధర ఆశాజనకంగా ఉంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర ఎప్పటి వరకు నిలకడగా ఉంటుందో మరి.
పసుపు ధర నియంత్రణ అధికార యంత్రాంగం చేతిలో ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండటం మన మార్కెట్‌లో ధర తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టమే జరుగుతుంది. ధర నియంత్రణపై చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
– సంజీవరెడ్డి, రైతు, దొన్కల్
వారం రోజుల వ్యవధిలో క్వింటాల్‌కు రూ.2వేలు పెరిగిన ధర
ఈ సీజన్‌లో రూ.15వేలకు పైగా
ధర లభించే అవకాశాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో
ధర పెరుగుదల
ఎగుమతులు పెరిగితే
మరింత పుంజుకునే అవకాశం
పసుపు ధరలపై ఆశలు
పసుపు ధరలపై ఆశలు


