కోడి గుడ్డు ధర ౖపైపెకి..
ప్రభుత్వం సరఫరా చేయాలి
నందిపేట్(ఆర్మూర్): కోడి గుడ్డు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోటా మేరకు గుడ్డు అందడం లేదు. పేద విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు గుడ్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో గుడ్డుకు రూ. 6 ఏజెన్సీలకు చెల్లిస్తుంది. గత రెండు నెలల నుంచి ధరలు విపరీతంగా పెరిగి ప్రస్తుతం రూ. 8.50 కు చేరుకుంది. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో గుడ్లను అందించలేకపోతున్నారు.
గుడ్ల స్థానంలో అరటిపండ్లు..
జిల్లాలో మొత్తం 1,158 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 94 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నిత్యం మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి మూడు కోడిగుడ్లు అందించాల్సి ఉంటుంది. ధరలు పెరగడంతో తక్కువ విద్యార్థులున్నా ప్రైమరీ పాఠశాలలో వారినికి రెండు రోజులు, హైస్కూల్, యూపీఎస్‌లలో మాత్రం ఒక్క రోజే కోడిగుడ్లు అందజేస్తున్నారు. మిగిలిన రోజులలో ప్రత్యామ్నాయంగా అరటి పండ్లు, బిస్కెట్లను అందిస్తున్నారు. కోడిగుడ్డు ధర పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు సైతం సక్రమంగా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా నేరుగా ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి. అలా చేస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందుతుంది. కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ పెరగడంతోతమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే గుడ్ల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్రశ్నించలేక పోతున్నాం. – అవదూత గంగాధర్,
మండల విద్యాధికారి, నందిపేట
రూ. 8.50కి చేరిన రేటు
మధ్యాహ్న భోజన నిర్వాహకులపై భారం
వారంలో మూడు రోజులకు బదులు ఒక రోజుకు పరిమితం


