
నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదిస్తాం
● మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే
సుదర్శన్ రెడ్డి
● ఖాజాపూర్, హున్సా, మందర్నా
శివారులో దెబ్బతిన్న పంటల పరిశీలన
బోధన్: భారీ వర్షాలకు నీట మునిగి నష్టపోయిన పంటల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంజీర నది తీరంలో సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్నా శివారులో వరద నీట మునిగి దెబ్బతిన్న పంటలను వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందర్నా శివారులో పంట పొలాల మధ్య దెబ్బతిన్న పొతంగల్ మండలంలోని సుంకిని వెళ్లే రోడ్డును పరిశీలించారు. మంజీర, గోదావరి నదులకు ఒకే సమయంలో భారీ వరద చేరి ఉధృతంగా ప్రవహించడం వల్ల పరీవాహక ప్రాంతంలో నియోజక వర్గంలోని సాలూర, బోధన్, రెంజల్, నవీపేట మండలాల్లో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లిందని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఉధృతిని నిలువరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. నియోజక వర్గంలో సోయా 14 వేలు, వరి పంట 18 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, డీఏవో గోవింద్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్స్‌కో డీఈ ముక్తార్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, తహీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల నాయకులు మందర్నా రవి, అల్లె రమేశ్, ఇల్తెపు శంకర్, చిద్రపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.