
ఎత్తిపోతల పున:ప్రారంభానికి కసరత్తు
● పథకం పంప్‌హౌస్‌ను సందర్శించిన ఇరిగేషన్, ఐడీసీ అధికారులు
● త్వరలో మోటార్ల ప్రారంభానికి చర్యలు
బోధన్:సాలూర శివారులోని మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పున:ప్రారంభానికి సంబంధిత అధికారులు కసరత్తు చేపట్టారు. మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం ఈ ఏడాది వర్షాకాలానికి ముందు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల మూతపడింది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభ అనంతరం మంజీరలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకం మోటార్లు ప్రారంభించి ఎత్తిపోసిన నీటిని చెరువుల్లో నింపుకొని అవసరాల మేరకు పంటల సాగుకు వినియోగించుకునే వారు. కాగా మూడు నెలల క్రితం ప్రధాన పంప్‌హౌస్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర సామగ్రిని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పథకం నిర్వహణ కమిటీ వద్ద నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి రాకుండా పోయింది. రైతుల స మాచారం మేరకు బుధవారం ఐడీసీ, ఇరిగేషన్ శాఖల అధికారులు పథకం కమిటీ సభ్యులతో కలి సి ప్రధాన పంప్‌హౌస్‌ను సందర్శించారు. కమిటీ సభ్యులతో సమావేశమై సమర్ధవంతంగా నిర్వహణకు ఐడీసీ ఏఈ గజానంద్ సూచనలు చేశారు.
కొత్త కమిటీ ఎన్నిక
పథకాన్ని పున:ప్రారంభించేందుకు రైతులు ఇటీవల సమావేశమై నిర్వహణకు సొసైటీ మాజీ చైర్మన్ శివకాంత్ పటేల్ చైర్మన్‌గా కొంత మంది సభ్యులతో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మరమ్మత్తులు మొదలు పెట్టారు. రూ.లక్ష 50 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పథకం నీటిని వినియోగించుకుంటున్న రైతులు మెట్టభూమికి ఎకరానికి రూ.600, మాగాణికి రూ.800 చొప్పున చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. రైతులు చెల్లించిన డబ్బులతో పంప్‌హౌస్ మరమ్మతులు, నిర్వహణ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. గతంలో రెండు దఫాలు పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను దొంగలించడంతో పథకం నిర్వహణకు అవాంతరాలు ఏర్పడ్డాయి.
పంటల సాగుకు భరోసా
దశాబ్దాన్నర కాలంగా రైతులు ఐక్యంగా ఎత్తిపోతల పథకం నిర్వహణలో పట్టు సాధించారు. నిర్వహణ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుని ముందుకెళ్లారు. ఎత్తిపోతల పథకం కోసం మూడు దశాబ్దాలుగా రైతులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో రూ.3 కోట్లు మంజూరు చేయగా పథకం రూపుదిద్దుకుంది. 2006–07 పథకం పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలు స్థిరీకరించారు. వర్షాధార మెట్టభూములు సస్యశ్యామలంగా మారాయి. వానాకాలం, యాసంగి సీజన్‌లో పంటల సాగుకు ఎత్తిపోతల పథకం నీటితో భరోసా ఏర్పడింది. తాజాగా పంప్‌హౌస్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర మరమ్మతులు పూర్తిచేసి త్వరలో మోటార్లు ప్రారంభించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సభ్యులు డిస్కో సాయిలు, ఇల్తెపు సాయన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లె రమేశ్, మాజీ ఎంపీటీసీ గాండ్ల పెద్ద రాజేశ్వర్, సభ్యులు పాల్గొన్నారు.

ఎత్తిపోతల పున:ప్రారంభానికి కసరత్తు