
మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్
ధర్పల్లి: మండల కేంద్రంలో మహిళపై కత్తెరతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భిక్షపతి తెలిపారు. బుధవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కళ్యాణితో కలిసి నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ధర్పల్లికి చెందిన కోటగిరి దాసుకు గంగామణితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. తన భార్య దూరం కావడానికి ధర్పల్లికి చెందిన మచ్చ లక్ష్మి, భోజేశ్వర్ అని అనుమానం పెంచుకున్న దాసు వారిని చంపేందుకు ఈనెల 2న లక్ష్మి ఇంటికి వెళ్లాడు. కత్తెరతో ఆమైపె, భోజేశ్వర్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన నాలుగురికి సైతం గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.