
335 టీఎంసీల వరద..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 335 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇంకా వరద నీరు రాక కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. జూన్, జూలై నెలల్లో ప్రాజెక్ట్‌లోకి ఆశించినంత వరద నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, జూలై చివరి మాసంలో కొద్దిమేర వరదలు రావడంతో ఆగస్టు 7 నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ స్థానిక ఎగువ ప్రాంతాలతోపాటు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అంతే కాకుండా ఆగస్టు 18 నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. 27 నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. గతేడాది సీజన్ ముగిసే వరకు 292 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.
నాలుగు రోజుల్లో 165 టీఎంసీలు..
ఎస్సారెస్పీలోకి ఆగస్టు 27 నుంచి వరద ప్రారంభమైంది. ఆ రోజంతా 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 28, 29, 30, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 165 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆరు రోజుల్లోనే 165 టీఎంసీల వరద నీరు రావడం చరిత్రలో ఇదే తొలిసారని ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి.
215 టీఎంసీలు గంగపాలు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో అంతే స్థాయిలో గోదావరిలోకి నీటి విడుదలను చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి గరిష్టంగా 39 వరద గేట్ల ద్వారా 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదారికి వదిలారు. గడిచిన ఆరు రోజుల వ్యవధిలో 165 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతుంది.
ప్రస్తుత సంవత్సరం
ఎస్సారెస్పీకి భారీ ఇన్‌ఫ్లో
270 టీఎంసీలు అవుట్ ఫ్లో
అందులో 215 టీఎంసీలు
గోదావరి పాలు