
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
బోధన్‌రూరల్: మద్యానికి బానిసైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామానికి చెందిన వన్నెల జ్యోతి(35) భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటు జీవిస్తోంది. కొంత కాలంగా ఆమె మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురైంది. సోమవారం గ్రామ శివారులోని చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహం చెరువులో లభ్యం కావడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇందల్వాయి: మండలంలోని పడకల్ వద్ద వాహనం ఢీకొని మృత్యువాత పడ్డ నాలుగేళ్ల చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి తిర్మన్‌పల్లి నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించినట్లు డీఎఫ్‌వో వికాస్ మీనా, ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ మంగళవారం పేర్కొన్నారు. వాహనదారులు దట్టమైన అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. జాతీయ రహదారుల అథారిటీకి ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్న దట్టమైన ఫారెస్ట్‌లో ఫెన్సింగ్, ఆరు అండర్ పాస్ లకు ప్రతిపాదనలు పంపినట్లు ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.
రుద్రూర్: ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సుకు సైడ్ ఇవ్వడానికి యత్నించి రోడ్డు కిందకు దించిన ఆర్టీసీ బస్సు పొలంలోకి వంగిపోయిన ఘటన మంగళవారం రుద్రూర్ మండలం అంబం(ఆర్) శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబం(ఆర్) నుంచి రుద్రూర్‌కు బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వస్తుండగా ఎదురుగా స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్ బస్సుకు దారి ఇద్దామనే ప్రయత్నంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. వర్షాలకు రోడ్డు పక్క మట్టి తడిసి ఉండడంతో ఒక్క సారిగా పొలంలోకి వంగిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి వేశాడు. మరో బస్సులో ప్రయాణికులను పంపించి వేశారు.

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య