
హంగర్గలో తగ్గుతున్న నీటి ఉధృతి
బోధన్‌రూరల్: మండలంలోని హంగర్గ గ్రామంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నదిలో వరద ప్రవాహం ఎక్కువవడంతో రెండు రోజులపాటు హంగర్గ గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో శనివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం తగ్గింది. ఇటీవల ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహయంతో గ్రామంలోని ముంపు ప్రాంతం నుంచి 376 మంది గ్రామస్తులను, 30కుపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తహసీల్దార్ విఠల్ తెలిపారు. వర్షం కురవకపోతే ఆదివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
3వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు
శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది ఉధృతితో హంగర్గతోపాటు ఖండ్‌గావ్, బిక్‌నెల్లీ, సిద్ధాపూర్, కల్దుర్కి శివారులోకి భారీగా వరదనీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మంజీర తీర గ్రామాల్లో సుమారు 3వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనవేశారు. అత్యధికంగా సోయా పంట దెబ్బతింది.
అడిషనల్ కలెక్టర్ పర్యటన..
హంగర్గ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ శనివారం స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పడవలో ప్రయాణించి గ్రామంలో పరిస్థితులను సమీక్షించారు. టెయినీ ఐఏఎస్ చింగ్తియాన్ మావీ, బోధన్ తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు.